- అత్యధిక స్కూల్స్‌లో 80% పైగా అర్హత లేని ఉపాధ్యాయులే.
- డీఈడీ, బీఈడీ అర్హత ఉన్న టీచర్లు చాలా చాలా తక్కువ.
- ఇంటర్, డిగ్రీ చదివిన వ్యక్తులతో పాఠాలు బోధిస్తున్న కార్పొరేట్ స్కూల్స్
- నర్సరీ నుండి 5 వ తరగతి వరకు పాఠశాల విద్య మరీ అధ్వానం.
- ఉపాధ్యాయుల కొరత ఉన్నా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న శ్రీచైతన్య, నారాయణ స్కూల్స్.
- సర్వేలో విస్తుపోయే వాస్తవాలు
- ప్రతి స్కూల్ నోటీస్ బోర్డ్‌లో టీచర్ల క్వాలిఫికేషన్‌తో పాటు, వాళ్ళ సర్టిఫికేట్స్‌ను నోటీస్ బోర్ట్‌లో పెట్టాలని తల్లిదండ్రుల డిమాండ్.
- ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి డిమాండ్ !
ప్రభుత్వ స్కూల్స్‌లో సౌకర్యాలు లేవని అప్పుసొప్పు చేసి ప్రైవేటు స్కూల్స్‌లో చేర్పిస్తున్న తల్లిదండ్రులకు పిడుగులాంటి వార్త. ప్రైవేటు స్కూల్స్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నా అర్హులైన టీచర్లు లేక రేపటితరం దీనస్థితిని ఎదుర్కొంటోంది. మీ పిల్లలకు సరైన పునాది పడాలంటే సరైన టీచర్లు ఉండాలి. కానీ శ్రీచైతన్య లాంటి ప్రైవేట్ స్కూల్స్‌లో అనర్హులతో పాఠాలు చెప్పిస్తున్నారు. మార్కులు, ర్యాంకులే జీవితమని భావించి ప్రైవేట్ స్కూల్స్ వెంట గుడ్డిగా పరుగులు పెడుతున్న తల్లిదండ్రులకు ఈ నిజం పెద్ద షాకే అని చెప్పాలి. శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ స్కూల్స్‌కి మూలస్తంభంగా భావించే టీచర్లలో 80% మంది పైగా అనర్హులే ఉన్నట్లు ప్రజాస్వామ్యం సర్వేలో తేలింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్హత లేని వారితో క్లాసులు నిర్వహించటం యావత్ విద్యాప్రపంచాన్ని విస్తుగొలుపుతోంది. ఓ స్కూల్ టీచర్‌కి అవసరమైన డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ (డిఈడీ), బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ( బీఈడీ) లేకుండానే కేవలం ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులతో నేడు కార్పొరేట్ స్కూల్స్ నడుస్తున్నాయంటే నమ్ముగలరా ? అవును...అనర్హులు యధేచ్చగా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటాన్నారు. అవును ఇది నిజం. నమ్మలేని నిజం, ఓ కటోరమైన వాస్తవం. మంది ఎక్కువైతే, మజ్జిగ పలుచన అన్న చందంగా డబ్బు సంపాదనే ధ్యేంగా ఇబ్బడిముబ్బడిగా స్కూల్స్ పెంచుకుంటూపోతున్న శ్రీచైతన్య, నారాయణ స్కూల్స్‌లో అర్హులైన బోధనా సిబ్బంది లేకపోవటం తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం. అర్హులైన టీచర్లు లేకపోతే క్వాలిటీ విద్య విద్యార్థులకు ఎలా అందుతుంది. విద్యార్థులు ప్రతిభావంతులుగా ఎలా రాణించగలరు ? అనేది తల్లిదండ్రులే ఆలోచించుకోవాలి. ఇకనైనా ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌పై మోజు వీడి అర్హులైన టీచర్లు ఉన్న స్కూల్స్‌ను గుర్తించి చేర్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
సంపాదన తప్ప...మరో ఆలోచన లేదు.
ఎక్కువ మంది విద్యార్థులు...మరింత ఎక్కువ డబ్బు సంపాదన అనే నినాదంతో ముందుకు వెళుతున్న శ్రీచైతన్య, నారాయణ స్కూల్స్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలలకు విస్తరించాయి. సంపాదనపై పెట్టిన శ్రద్ధ స్కూల్స్‌లో అర్హులైన టీచర్లను నియామకంపై పెట్టకపోవటం కార్పొరేట్ స్కూల్స్ ధనదాహానికి నిదర్శనం. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌లో ఇప్పటికే టీచర్ల కొరత ఉంది, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రైవేటు స్కూల్స్ ఎటువంటి ప్రయత్నాలు చేయకపోగా, జీతాలు ఆశచూపి డిగ్రీ అర్హత గల వారితో ఆ లోటును భర్తీ చేస్తోంది. అర్హత లేని వారితో విద్యాబోధన చేయిస్తోంది. చదివిన చదువుకి చేసే పనికి ఎలాంటి సంబంధం లేని వారు కార్పొరేట్ స్కూల్స్‌లో కోకోల్లలు. అర్బన్ ప్రాంతాల్లో అర్హత కలిగిన టీచర్ల పరిస్థితి కొంచం మెరుగ్గా ఉన్నప్పటికీ, రూరల్ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరీ తీసికట్టుగా ఉంది. ఈ విషయంపై లోతైన పరిశోధన చేసింది ప్రజాస్వామ్యం. ప్రతీ బ్రాంచ్‌లో టీచర్ల అర్హతపై ఆరా తీసింది. ఈ పరిశోధనలో తేలింది ఏమిటంటే అతిపెద్ద కార్పొరేట్ సంస్థ అయిన శ్రీచైతన్య సిబ్బందిలో కేవలం 16% మంది మాత్రమే , డీ.ఈడీ, బీఈడీ అర్హత కలిగిన వారు ఉండటం ఆశ్చర్యం కలిగించింది. టీచర్ల హాజరుకు సంబంధించి ఎక్కడ బయోమెట్రిక్‌తో కూడిన హాజరు శ్రీచైతన్యలో ఉండదు. ఎందుకంటే ఏ బ్రాంచ్‌లో అయితే ఇబ్బంది వస్తుందో అక్కడికి టీచర్లను తరలించి సమస్యను నుండి బయటపడడానికి శ్రీచైతన్య యాజమాన్యం వాడుతున్న టెక్నిక్‌గా తెలుస్తోంది. మిగిలిన విద్యాసంస్థలు అన్నీ కూడా కేవలం డిగ్రీ ఇతర పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌తో నెట్టుకురావటం గమనార్హం.
ఒక కార్పొరేట్ స్కూల్‌లో జరుగుతున్న వాస్తవం !
హైద్రాబాద్‌లోని ఒక ప్రముఖ కార్పొరేట్ స్కూల్‌కి మంచి పేరుంది. ఆ పేరుకి తగినట్టే ఒకటవ తరగతి అడ్మిషన్లు 6 సెక్షన్స్ నిండిపోయాయి. ఈ సెక్షన్స్ నుండి తెలివైన విద్యార్థులను వేరుచేసి 2 సెక్షన్స్‌గా చదువులో యావరేజ్ ఉన్న మరి కొంత మంది విద్యార్థులను మరో 2 సెక్షన్స్‌గా, అల్లరి పిల్లలను, చదువులో వెనుకబడిన విద్యార్థులను మరో 2 సెక్షన్స్‌గా విభజించి చదువు చెప్తున్నారు. తెలివైన విద్యార్థులకు చెందిన 2 సెక్షన్స్‌కు మాత్రమే కొంచం మంచి టీచర్స్‌ను నియమించి మిగిలిన వారికి సాధారణ టీచర్స్‌తో పాఠ్యాంశాల బోధన జరుగుతుంది. వెనుక బడిన విద్యార్థులను పట్టించుకుని వారిని ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలు ఏవీ జరగటం లేదు. అలా చేసేందుకు ఉపాధ్యాయులకు సరైన ప్రతిభ లేదు, డీఈడీ, బీఈడీ వంటి టీచర్ ట్రైనింగ్ కోర్సు చేసిన క్వాలిఫైడ్ టీచర్లు లేరు. మరో పాఠశాలలో 2 వ తరగతి చెందిన విద్యార్థులు కనీసం హిందీ, ఆంగ్లం, తెలుగు అక్షరాలను గుర్తించలేని స్థితిలో విద్యార్థులు ఉన్నారంటే టీచర్స్ ఎంత దారుణంగా ఉన్నారో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. మరో స్కూల్‌లో డిగ్రీ అర్హత కలిగి డౌట్స్ క్లారిఫికేషన్‌కు ట్యూటర్స్, వార్డెన్స్‌ని టీచర్స్‌గా ప్రమోట్ చేసి వారిచే పాఠాలు బోధింపజేస్తున్నారు.
అతితక్కువ జీతం
శ్రీచైతన్య, నారాయణతోపాటు ఇతర కార్పొరేట్ స్కూల్స్‌లో పనిచేసే టీచర్లకు ఇచ్చే జీతాలు అంతంత మాత్రమే. నెలకు జీతంగా ఇచ్చేది 8000/` నుండి 15000/` మాత్రమే. ఆయా సిబ్బంది అనుభవాన్ని బట్టి జీతం పెరుగుతూ ఉంటుంది.ప్రభుత్వ టీచర్లతో సమానంగా జీతాలు ఇవ్వాల్సి ఉన్నా డీఈడీ, బీఈడీ లేదని జీతాల్లో కోత విధిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే అసలు జీతం 10000/` అయితే 30000/` అకౌంట్స్‌లో వేసి ఆయా టీచర్ల దగ్గర నుండి చెక్‌బుక్‌లు, డెబిట్ కార్డులు తీసుకుంటున్నారు. శాలరీ జమ అయిన వెంటనే మిగిలిన సొమ్మును సొంత ఖాతాలకు మళ్ళించుకుంటున్నారు. అదే సమయంలో రోజుకి 12 గంటలకు పైగా వెట్టిచాకిరీ చేయంచుకుంటున్నారని కార్పొరేట్ స్కూల్స్ పనిచేసే సిబ్బంది వాపోతున్నారు. సెలవుల్లో సైతం అడ్మిషన్ల కోసం ఇంటింటికీ తిప్పి ముప్పుతిప్పులు పెడుతున్నారని తమ సమస్యల గురించి ఎకరువు పెడుతున్నారు.
తల్లిదండ్రుల స్పందన !
ప్రభుత్వ స్కూల్స్‌ల్సో సిబ్బంది, సౌకర్యాల కొరత కారణంగా ప్రైవేటు స్కూల్స్ వైపు మొగ్గు చూపిన తల్లిదండ్రులకు ఈ పరిణామం హతాశుల్ని చేస్తోంది. క్వాలిపౖెెడ్ టీచర్స్‌తో క్వాలిటీ విద్యకోసం ఖర్చును సైతం లెక్కచేయకుండా శ్రీచైతన్య, నారాయణ లాంటి స్కూల్స్‌లో చేర్పిస్తుంటే ఇలా నిలువునా దగా చేస్తున్నా ఏమి చేయాలో పాలు పోవటం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ దెబ్బతో కార్పొరేట్ స్కూల్స్‌పై నమ్మకం చచ్చిపోయిందంటున్నారు. మా పిల్లలపై ఉన్న ప్రేమ, వారి భవితపై ఉన్న ఆశను శ్రీచైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ సంస్థలు అలుసుగా తీసుకుంటున్నాయని వాపోయారు. ఇక నుండి ప్రతి ప్రైవేట్ స్కూల్స్‌లో క్వాటిఫైడ్ టీచర్లు ఉంటేనే అక్కడ చేర్పిస్తామంటున్నారు తల్లిదండ్రులు. టీచర్ల క్వాలిఫికేషన్‌కు సంబంధించిన సర్టిఫికేట్స్ ప్రతి స్కూల్ నోటీస్ బోర్డ్‌లో తప్పని సరిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఎండమావుల వెంట పరుగులు తీయటం ఎప్పటికైనా ప్రమాదమే ఈ ఉదంతం తెలియజేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం సైతం ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో కనీసం సరైన విద్యార్హత కలిగిన టీచర్లను నియమించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
0 Comments