Ticker

6/recent/ticker-posts

SriChaitanya School : సుచిత్రలో శ్రీచైతన్య బరితెగింపు !!

  • అనుమతులు లేకుండానే స్కూల్‌ నిర్వహిస్తున్న సుచిత్ర శ్రీచైతన్య !  
  • అడ్డుకున్న విద్యాశాఖ అధికారులు ! 
  • విద్యాశాఖ అధికారుల అదేశాలను బేఖాతర్‌ చేస్తున్న శ్రీచైతన్య నిర్వహకులు ! 
  • పాఠశాల సీజ్‌ చేసిన ఎంఈఓ !  
  • క్రిమినల్‌ కేసులు నమోదు చేసే దిశగా విద్యాశాఖ !

విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడిచినప్పటికీ స్కూల్‌ నిర్వహణ కోసం ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న సుచిత్ర శ్రీ చైతన్య పాఠశాలకు కుత్బుల్లాపూర్‌ ఎంఈఓ వసంతకుమారి షోకాజ్‌ నోటీసులు అందజేశారు. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ జీడిమెట్ల డివిజన్‌ దుర్గా ఎస్టేట్‌ మూడు గుండ్ల ఎదురుగా శ్రీ చైతన్య పేరిట అనుమతులు లేకుండా పాఠశాలను ఏర్పాటు చేశారు. దీంతో కుత్బుల్లాపూర్‌ ఎంఈఓ వసంతకుమారి పాఠశాలను అధికారికంగా సీజ్‌ చేశారు. అయినప్పటికీ శ్రీ చైతన్య పాఠశాల నిర్వాహకులు ఎంఈఓ ఆదేశాలను ఖాతరు చేయకుండా అడ్మిషన్లు తీసుకుంటూ వచ్చారు. బుధవారం శ్రీ చైతన్య పాఠశాల ప్రారంభమవుతుందని తెలుసుకున్న ఎంఈఓ పాఠశాలకు వచ్చి మూడోసారి షోకాజ్‌ నోటీసులు అందజేశారు. అనుమతులు తెచ్చుకోవడానికి తమకు 15 రోజులు గడువు ఇవ్వాల్సిందిగా శ్రీ చైతన్య పాఠశాల నిర్వాహకులు ఎంఈఓ ను కోరగా మూడు రోజులు మాత్రమే గడువు అంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది.

NSUI అభ్యంతరం..

సుచిత్ర శ్రీ చైతన్య పాఠశాలకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడానికి వచ్చిన ఎంఈఓ వసంతకుమారి, ఎంఎల్‌ఓ రమేష్‌ లకు అభ్యంతరం తెలిపారు. శ్రీ చైతన్య పాఠశాలకు పక్కనే ఉన్న మరొక పాఠశాలకు ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయో చెప్పాలని, ఆ స్కూల్‌ కి నోటీసులు ఇచ్చిన తర్వాతనే చైతన్య స్కూలుకు నోటీసులు ఇవ్వాలని కొద్దిసేపు భీష్మించుకు కూర్చున్నారు. ఈ విషయంపై కచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలకు అన్నింటికీ నోటీసులు ఇస్తామని ఎంఎల్‌ఓ రమేష్‌ స్పష్టంగా తెలియజేస్తూ శ్రీ చైతన్య నిర్వాహకులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు.

అన్నింటిపై చర్యలు తీసుకోవాలి : ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థి సంఘం

శ్రీ చైతన్య పాఠశాల పక్కనే ఉన్న సెయింట్‌ ఆంథోనీ పాఠశాలను ఎంఈఓ వసంతకుమారి పరిశీలించారు. ఈ సందర్భంలో ఎన్‌ ఎస్‌ యు ఐ విద్యార్థి సంఘ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అన్ని పాఠశాలలకు చట్టపరంగా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తమకు ఈ పాఠశాల ఆ పాఠశాల అనే భేదభావం లేదని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు.

మరోసారి ధర్నా..

అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహణ చేస్తున్న సుచిత్ర శ్రీ చైతన్య పాఠశాల ముందు బుధవారం బడ్జెట్‌ పాఠశాల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు మరోసారి ధర్నా చేశారు. అనుమతులు లేకుండా ఏ విధంగా 300 కు పైగా విద్యార్థులను అడ్మిషన్‌ తీసుకొని తరగతులు నిర్వహిస్తారు అని మండిపడ్డారు. శ్రీ చైతన్య పాఠశాల పై విద్యాశాఖ అధికారులు క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు.

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం : ఎంఈఓ వసంతకుమారి

ఈ విషయంపై కుత్బుల్లాపూర్‌ ఎంఈఓ వసంతకుమారి మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాలకు ఇప్పటికే మూడు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని, ఈ పాఠశాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకోవడమే కాకుండా, సీజ్‌ చేసిన పాఠశాలను తెరవడంపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

నిద్రలేచిన విద్యాశాఖ !

విద్యాశాఖలో ఇలాంటి అనుమతులు లేని పాఠశాలలు నగర వ్యాప్తంగా చాలా ఉన్నాయంటున్నారు తల్లిదండ్రులు. వాటిని గుర్తించి ఆయా యాజమాన్యాలపై చర్యలకు విద్యాశాఖ ఉపక్రమించాలని కోరుతున్నారు. అలాగే ప్రతి స్కూల్‌/ పాఠశాల బోర్డు ముందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ నంబర్‌, డోర్‌కి ప్రభుత్వ అనుమతి ఉన్న సర్టిఫికేట్‌ తప్పనిసరిగా ఉండాలని కోరుతున్నారు. ఇక ప్రవేటు విద్యాసంస్థల ఆటలు సాగవని హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
IT RIDES : రూ. 230 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడిన శ్రీచైతన్య !
Sri chaitanya Block Money : శ్రీచైతన్య...నల్లధనం కేరాఫ్‌గా వర్సిటీ !
INFINITY META APP : ఆన్‌లైన్‌ పేరుతో ఇన్ఫినిటీ దోపిడీ !
Suicides in Sri chaityana Hostels: కార్పొరేట్‌ హాస్టల్స్‌లో ఘోషిస్తున్న ఆత్మలు !
Sri Chaitanya : Jee Main 2025లో శ్రీచైతన్య గోల్‌మాల్‌ రిజల్ట్స్‌ !
INFINITY LEARN : ర్యాంక్‌గురు (ఇన్ఫినిటీ లెర్న్‌ ) మరో బైజూస్‌ కానుందా ?
IT Rides on Sri Chaitanya : కొత్త తరహా మోసంలో శ్రీచైతన్య నేషనల్‌ రికార్డ్‌ !