- ప్రతిభావంతులైన విద్యార్థుల్ని పట్టుకునేందుకు స్కాలర్‌షిప్ ట్రాప్ !
- 2023లో రూ. 300 కోట్లు, ఈసారి ఏకంగా రూ. 600 కోట్లు పెంచిన ఫిడ్జి !
- తల్లిదండ్రులారా..బోగస్ స్కాలర్‌షిప్‌ల పట్ల పారాహుషార్ !
- ఎగ్జామ్ ఫీజులతోనే కోట్లు దండుకునే వ్యూహం
- రిజల్ట్ రోజున రూ. 600 కోట్లు స్కాలర్‌షిప్ సాధించిన విద్యార్థుల వివరాలు ప్రకటించే దమ్ము ఉందా ?
స్కాలర్‌షిప్‌లు ఎవ్వరూ ఊరికే ఇవ్వరు !
స్కాలర్‌షిప్‌లను ఎర వేసి డబ్బును సంపాదించటం ఎలానో మన కార్పొరేట్ విద్యాసంస్థలకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు అంటే నమ్ముతారా ? ఇప్పుడు ప్రత్యక్షంగా చూడండి. ఫిడ్జి పరీక్ష వ్రాయండి, 600 కోట్ల స్కాలర్‌షిప్ పొందండి. ఈ ఒక్క ప్రకటన చాలు ఎంతో మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పరుగులు పెట్టడానికి. తమ లక్ ఎలా ఉందో పరిశీలించుకోవడానికి పోటీపడుతుంటారు. ఇక్కడే తప్పులో కాలు వేస్తున్నారు. డబ్బులు ఊరికే ఎవరైనా ఇస్తారా ? అని మాత్రం ఆలోచంచటం లేదు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని ఒక పెద్దాయన పదే పదే చెప్తున్నా ఎవరూ వినటం లేదు. కానీ ఇప్పుడు ఆలోచించండి. ఫీజుల కోసం తల్లిదండ్రుల్ని జలగల్లా పీల్చే కార్పొరేట్ విద్యాసంస్థలు రూ. 600 కోట్లు స్కాలర్‌షిప్ ఇస్తున్నాయి అంటే ఎలా నమ్ముతున్నారు.
స్కాలర్‌షిప్ పేరుతో ఆకర్షించటం...ఆపై మభ్యపెట్టడం !
ముందుగా రూ. 600 కోట్లు స్కాలర్‌షిప్ అని భారీ ప్రకటనలకు తెరతీస్తారు. తల్లిదండ్రుల ఆశలపై ఆకర్షణ వల విసురుతారు. పరీక్ష వ్రాయిస్తారు, సెలక్ట్ కాలేదు అని చిన్న కారణం చూపి మీ డేటాను తస్కరిస్తారు. ఇది కార్పొరేట్ విద్యాసంస్థల నయా దోపిడీ దందా స్టైల్. ఈ దందా కోసం కొత్త రూటును కనిపెట్టారు. దీని కోసం సోషల్ మీడియాను భారీగా వాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారి కోసం పదే పదే ప్రకటనతో ఆకర్షించేలా ప్రకటనలు గుప్పిస్తూ విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మభ్యపెడుతోంది ఫిట్జి విద్యాసంస్థ. సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 6 వ తేదీ వరకు 8 రోజుల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్ నిర్వహించనుంది. 600 కోట్ల స్కాలర్‌షిప్ అంటూ విద్యార్థుల ఫ్రీ సమయాన్ని బట్టి టైమ్‌ని కేటాయించేలా స్లాట్‌ల విధానాన్ని రూపుదిద్దింది ఫిడ్జి విద్యాసంస్థ. పైకి స్కాలర్‌షిప్ టెస్ట్ మాత్రమే, కానీ దీని వెనుక పెద్ద తతంగమే నడుస్తుంది. దేశవ్యాప్తంగా టాటెంటెడ్ స్టూడెంట్స్ యొక్క వివరాలను వెతికి పట్టుకోవటమే ఈ స్కాలర్‌షిప్ ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం. ఫిడ్జి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు కాకుండా ఇతర విద్యాసంస్థల్లోని టాలెంటెడ్ స్టూడెంట్స్ వివరాలు సేకరించేందుకు వేసిన వలే ఈ ఫిడ్జి టాలెంట్ రివార్డ్ ఎగ్జామ్. దేశవ్యాప్తంగా ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ స్కూల్స్‌లో ప్రతిభావంతుల్కెన విద్యార్థులు ఉన్నారో వారి వివరాలు సేకరిస్తుంది. ఆ డేటాను ఉపయోగించి ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి ఫిడ్జి హాస్టల్స్‌లో ఉచిత విద్యను ఆఫర్ చేయటం దగ్గర నుండి వేరే ఇతర ప్రోత్సాహకాలు ఆశచూపి తమ విద్యాసంస్థల్లో చేరేలా మభ్యపెట్టటమే ఈ స్కాలర్‌షిప్ వెనుక ఉన్న అసలు లక్ష్యం. ఎందుకంటే బాగా టాలెంటెడ్ విద్యార్థులు రాబోయే రోజల్లో నీట్, జెఈఈ అడ్వాన్స్‌డ్ లాంటి ఎగ్జామ్స్‌లో 10 లోపు ర్యాంకు సాధిస్తే సంస్థ తలరాతే మారిపోతుంది. ఒక్క ర్యాంకు సాధిస్తే చాలు వేలాది అడ్మిషన్లు వచ్చేస్తాయి. గత సంవత్సరం ఫిడ్జి ఫలితాలను తీసుకుంటే జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్ వంటి ఎగ్జామ్స్‌లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 100 లోపు మంచి ర్యాంకులను సాధించింది. ఆ ర్యాంకులతోనే ఇప్పుడు మార్కెటింగ్ చేసుకుంటోంది. ఫిడ్జిలో చదివితే ఫస్ట్ ర్యాంకు వస్తుంది అని నమ్మిస్తోంది. కేవలం కొద్ది మంది ర్యాంకులు చూపి వందలు, వేలల్లో విద్యార్థులను సంస్థల్లో చేర్పించుకుంటున్నారు. అసలు ర్యాంకులు రాని వారు ఎందరో ఉన్నారు. కానీ వారి వివరాలు మాత్రం ఎక్కడా ప్రచురించరు. ఫిడ్జి సంస్థలో చదివే ప్రతి విద్యార్థికి ఆలిండియా ఫస్ట్ ర్యాంకు వస్తుందా ? కనీసం 100 లోపు ర్యాంకైనా వస్తుందా ? ఫిడ్జి గ్యారెంటీ ఇవ్వగలదా ? పేరెంట్స్ ఎందుకు ఆలోచించటం లేదో వారికే తెలియాలి. ఎందుకంటే తమ పిల్లాడికి మంచి ర్యాంకు వస్తుందేమోనని ఆశ. అదే ఆశే ప్రైవేటు విద్యాసంస్థలకు వరంగా మారింది. కాసుల వర్షం కురిపిస్తోంది.
షరతులు చూస్తే దిమ్మతిరుగుతుంది.
ఫిడ్జి ప్రోగ్రామ్స్ & హాస్టల్ ఫీజుల మీద రూ.600 కోట్ల స్కాలర్‌షిప్ ఇవ్వనున్నట్లు ఫిడ్జి మభ్యపెడుతోంది. ఇది ఒక ఫేక్ ప్రామిస్. ఒకవేళ వేరే సంస్థలో చదువుతూ ఫిడ్జి టాలెంట్ రివార్డ్ ఎగ్జామ్‌లో మంచి ఫలితం వచ్చినా ప్రయోజనం దక్కదు. ఎందుకంటే వచ్చే సంవత్సరం నుండి ఫిడ్జి సంస్థలో అడ్మిషన్ తీసుకున్న వారికే మాత్రమే ఆ ప్రయోజనం వర్తిస్తుంది. కావలంటే నిశితంగా గమనించండి రూ. 600 కోట్ల వద్ద పెద్ద పెద్ద అక్షరాలతో ఫిడ్జి ప్రోగ్రామ్స్ & హాస్టల్ ఫీజలు మీద మాత్రమే అని షరతులు విధించింది. వీటితో పాటుగా రూ. 15 కోట్ల నగదు బహుమతులు అని ప్రకటించింది. విధించిన షరతులు అన్నీ ఫిడ్జి సంస్థకు అనుకూలంగా పెట్టుకుంది. చివరికి మోసపోతున్నది విద్యార్థులే. ప్రతిభావంతులని గుర్తించటం, వారిని తమ సంస్థల్లో చేర్చుకోటం. ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ దగ్గర నుండి సరాసరిన 150/- నుండి 900/- వరకు వసూలు చేసి అదనంగా కోట్లు కొల్లగొడుతున్నారు. టెస్ట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కొద్ది మొత్తంలో నగదు బహుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రిజల్ట్ రోజున సారీ...మీ పిల్లవాడు అర్హత సాధించలేదు అని చిన్న మేసేజ్‌తో బెటర్‌లక్ నెక్ట్ ట్కెమ్ అంటున్నారు. అక్కడితో ఆగుతుందా అంటే అదీ లేదు. ఫిడ్జిలో చేరండి, టాప్ ర్యాంకులు సాధించండి అంటూ మార్కెటింగ్ వాళ్ళు బయలు దేరుతారు. కావాలంటే ఫీజులో కన్సెషన్స్ ఇస్తాం అంటూ మభ్యపెడుతూ తల్లిదండ్రుల వెంటపడటం, అడ్మిషన్ల సంఖ్య పెంచుకోవటం, కోట్లు వెనకేసుకోవటం ఇదే ఫిడ్జి టాలెంట్ రివార్డ్ ఎగ్జామ్ వెనుక ఉన్న ఫిడ్జి విద్యాసంస్థ దూరలోచన.
పరీక్షల పేరుతో తీవ్ర ఒత్తిడి !
ఇప్పటికే కార్పొరేట్ స్కూల్స్/ కాలేజీల్లో డైలీ, వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ పేరుతో విద్యార్థులపై ఒత్తిడిని అధికం చేస్తున్న విద్యాసంస్థలు...ఇదీ చాలదు అన్నట్లు స్కాలర్‌షిప్ పేరుతో మరింత ఒత్తిడికి గురిచేస్తున్నాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ సమయంలోనే దాదాపు 5 కార్పొరేట్ విద్యాసంస్థలు స్కాలర్‌షిప్ పేరుతో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్షల కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను సన్నద్ధం చేస్తున్నారు. తమ పిల్లలను మానసిక ఒత్తిడికి గురిచేయటంతో పాటు విలువైన కష్టార్జితాన్ని కార్పొరేట్ సంస్థలకు సమర్పించుకుంటున్నారు. ఇక సిలబస్ విషయానికి వస్తే ఈ కార్పొరేట్ సంస్థలు తమ స్కాలర్‌షిప్ నిర్వహించే సమయానికి కల్లా మొత్తం సిలబస్‌ను పూర్తిచేసేస్తున్నారు. ఆయా తరగతులు కేవలం మ్యాధ్స్ Ê సైన్స్ సబ్జెక్టులపైనే దృష్టి పెట్టించి మిగతా సబ్జెక్టులను గాలికి వదిలేస్తున్నారు. ఇంటర్ వారికైతే మ్యాథ్స్ , ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ సబ్జెక్టులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగతా సబ్జెక్టులకు ప్రాధాన్యతే లేదు. ఎప్పుడూ ఒకే సబ్జెక్టు మీద ఒకే పనిగా రుబ్బితే ఎలా ఉంటుందో ఆలోచించండి. పిల్లలపై ఒకేసారి అనవసరంగా ఒత్తిడి పెంచకండి.
0 Comments