- 2022, 2023 ఏళ్ళలో స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థుల జాబితా ఎక్కడ ?
- 2024 లో ఐనా 1000 కోట్లు గెలుచుకున్న విద్యార్థుల జాబితాను బహిరంగ పరిచే ధైర్యం ఉందా ?
- ఈసారి వదిలే ప్రసక్తే లేదు, ఉద్యమానికి సిద్ధం అంటున్న విద్యార్థి సంఘాలు.
- బోగస్ స్కాలర్‌షిప్ పేరుతో Dr. B.S. Rao కి అవమానం !?
- పరీక్షల్లో మ్యాథ్స్ & సైన్స్‌లకే ప్రాధాన్యం, పట్టింపులేని ఇతర సబ్జెక్టులు !
- ఒక్కో విద్యార్థి నుండి 150/- ఎగ్జామ్ ఫీజు
- ఇతర స్కూల్స్/కాలేజీల్లో టాపర్స్‌ను లాగేసుకోవటమే టార్గెట్.
1000 కోట్ల స్కాలర్‌షిప్...అంటే చాలా పెద్ద అమౌంట్. మా పిల్లాడిని పరీక్ష వ్రాయిస్తే...ఈ సంవత్సరం ఫీజు కట్టవలసిన అవసరం ఉండదేమో అని ఓ సగటు మధ్య తరగతి తండ్రి ఆలోచన. ఇలా ఆలోచించే మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి తల్లిదండ్రుల ఆశల్ని ఆసరాగా చేసుకుని ఓ భారీ ప్రకటనతో ప్రజల్ని మభ్యపెడుతోంది శ్రీచైతన్య. కానీ నిర్వహించేది మాత్రం Infinity Learn (ర్యాంకుగురు టెక్నాలజీస్ ప్రై.లి. కంపెనీ), ఇది కూడా శ్రీచైతన్య డైరెక్టర్స్ నిర్వహించే సంస్థే. పైకి ఇది శ్రీచైతన్య సంస్థ వ్యవస్థాపకులు Dr. B.S. Rao Vidya jyoti Scholarship Foundation పేరుతో నిర్వహిస్తున్నా, ఈ ఎగ్జామ్స్ నిర్వహణ ద్వారా SriChaitanya సొసైటీ/ట్రస్ట్‌లకు చెందిన నిధులను తమ సొంత ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలోకి మళ్ళించటం కోసం ఈ స్కాలర్‌షిప్ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్ష నిర్వహిస్తున్న ర్యాంకుగురు టెక్నాలజీస్ కంపెనీ మొత్తం విలువే 100 కోట్లు, మరీ రూ. 1000 కోట్లు స్కాలర్‌షిప్ రూపంలో ఎలా ఇస్తుంది ? విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి.
1000 కోట్ల...భారీ ప్రచారం !
1000 కోట్ల స్కాలర్‌షిప్ అంటూ భారీ మరియు ఆకర్షణీమమైన ప్రకటనలో సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది Infinity Learn. పైకి స్కాలర్‌షిప్ టెస్ట్ మాత్రమే, కానీ దీని వెనుక పెద్ద తతంగమే నడుస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులను వెతికి వెతికి పట్టుకోవటమే ఈ స్కాలర్‌షిప్ ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం. శ్రీచైతన్య విద్యాసంస్థల్లోని విద్యార్థులు కాకుండా ఇతర విద్యాసంస్థల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు వల వేసేందుకు టార్గెట్ చేసిందే స్కోర్ ఎగ్జామ్. భారీ నగదుకు ఆశపడి శ్రీచైతన్య స్కాలర్‌షిప్ వ్రాశారా...అంతే. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమాచారం మొత్తం లాగేసుకుంటుంది. దేశవ్యాప్తంగా అద్భుతమైన ప్రతిభ చూపిన విద్యార్థుల వివరాలు సేకరిస్తుంది. ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి ఉచిత విద్యను ఆఫర్ చేయటం దగ్గర నుండి భారీ నగదు ఆశచూపి తమ విద్యాసంస్థల్లో చేరేలా మభ్యపెట్టటమే ఈ స్కాలర్‌షిప్ వెనుక ఉన్న అసలు లక్ష్యం. ఎందుకంటే బాగా టాలెంటెడ్ విద్యార్థులు రాబోయే రోజల్లో NEET, JEE ADV. లాంటి ఎగ్జామ్స్‌లో 10 లోపు ర్యాంకు సాధిస్తే సంస్థ తలరాతే మారిపోతుంది. ఒక్క ర్యాంకు సాధిస్తే చాలు వేలాది అడ్మిషన్లు వచ్చేస్తాయి. గత సంవత్సరం శ్రీచైతన్య ఫలితాలను తీసుకుంటే JEE MAIN, ADVANCED, NEET వంటి ఎగ్జామ్స్‌లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 1 వ ర్యాంకు సాధించింది. ఆ ర్యాంకులతోనే మార్కెటింగ్ చేసుకుంటోంది. శ్రీచైతన్యలో చదివితే ఫస్ట్ ర్యాంకు వస్తుంది అని నమ్మిస్తోంది. కేవలం 3 అంటే 3 ర్యాంకులు చూపించి లక్షలాది అడ్మిషన్లు జరిగాయి అంటే నమ్ముతారా ? మరి ఈ లక్షలాది మందికి ఆలిండియా ఫస్ట్ ర్యాంకు వస్తుందా ? పేరెంట్స్ ఎందుకు ఆలోచించటం లేదో వారికే తెలియాలి. ఎందుకంటే తమ పిల్లాడికి మంచి ర్యాంకు వస్తుందేమోనని ఆశ. అదే ఆశే ప్రైవేటు విద్యాసంస్థలకు వరంగా మారింది. కాసుల వర్షం కురిపిస్తోంది.
షరతులు, నిబంధనలు ఎందుకు ?
రూ. 1000 కోట్ల స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు సిద్ధమైన శ్రీచైతన్య...ఎంత మందికి ఇస్తుంది, ఒక్కొక్కరికి ఎంత ఇస్తుంది, ఎలా ఇస్తుంది అనే వివరాలు ఇవ్వకుండా తప్పించుకుంది. రూ. 1000 కోట్ల వద్ద ఒక్క స్టార్ మార్క్ పెట్టి షరతులు వర్తిస్తాయి అని పెట్టింది. ఆ షరతుల వివరాలు ఏంటి అనేది ఎక్కడా పొందపరచలేదు. అంటే శ్రీచైతన్యకు ఇచ్చే ఉద్ధేశ్యం లేదా ? స్కాలర్‌షిప్ ఇచ్చే ఉద్ధేశ్యం ఉన్నప్పుడు ఈ షరతులు, నిబంధనలు ఎందుకు ? ఉదాహరణకు 10 వ తరగతిలో ఆలిండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన వారికి 10 లక్షలు, 2 వ ర్యాంకు సాధించిన వారికి 5 లక్షలు అంటూ తరగతుల వారీగా ఏ ర్యాంకు సాధించిన వారికి ఎంతో ఇస్తుందో క్లియర్‌గా ప్రకటించలేదు. అదే సమయంలో శ్రీచైతన్య స్కోర్ 2023 ఫలితాల్లో ప్రతి తరగతిలో కేవలం 100 లోపు ర్యాంకులు సాధించిన వారికి మాత్రమే కేవలం నగదు బహుమతులు ప్రకటించింది. స్కాలర్‌షిప్ సాధించిన వారి వివరాలు బహిరంగంగా ప్రకటించలేదు. అసలు రూ. 1000 కోట్ల రూపాయలు ఎంత మందికి ఇచ్చింది, ఎంతెంత ఇచ్చింది వెబ్‌సైట్‌లో ప్రకటించి విశ్వసనీయత నిరూపించుకోవలసి ఉంది. కానీ ఫలితాల ప్రకటన రోజున మీడియా ముఖంగా అడిగితే ఫలితాలు కేవలం ఆన్‌లైన్‌లోనే ప్రకటిస్తామని చేతులు దులుపుకుంది. ఈ పరిణామాలను గమనిస్తే విద్యాలోకానికి సేవ చేసిన డా॥బి.ఎస్.రావు విద్యాజ్యోతి స్కాలర్‌షిప్ అనేది కేవలం బూటకమేనా ? బోగస్ స్కాలర్‌షిప్‌కు బి.ఎస్. రావు వంటి మహనీయుడిని పేరు పెట్టి అవమానిస్తున్నారా అంటే అవును అనక తప్పదు. లేదు బి.ఎస్.రావు గారి మీద ప్రేమ ఉంటే శ్రీచైతన్య 1000 కోట్లు స్కాలర్‌షిప్ ఎవరెవరికీ ఎంత ఇస్తుందో బహిరంగంగా ప్రకటించి విశ్వసనీయత చాటుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే అందరిలాగే శ్రీచైతన్య కూడా ఒక మోసపూరిత సంస్థగా భావించవలసి ఉంటుంది. శ్రీచైతన్య విశ్వసనీయత చాటుకుంటుందా ? మోసపూరిత సంస్థగా మిగిలిపోతుందా అనేది తేలనుంది.
అసలు రూ. 1000 కోట్లు ఎక్కడివి ?
డా॥బి.ఎస్.రావు విద్యాజ్యోతి స్కాలర్‌షిప్ ఫౌండేషన్ ద్వారా రూ. 1000 కోట్ల స్కాలర్‌షిప్‌కు సంబంధించిన డబ్బు ఎక్కడవి ? శ్రీచైతన్య యాజమాన్యానివా ? సొసైటీకి చెందినవా ? లేక ప్రై.లి. కంపెనీవా ? ఈ నగదు బ్లాక్ లేక వైటా ? నల్లధనాన్ని స్కాలర్‌షిప్‌ల రూపంలో విద్యార్థులకు ఇస్తున్నట్లు చూపిస్తూ వాటిని శ్రీచైతన్య యాజమాన్యానికి చెందిన వివిధ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల్లోకి మళ్ళించి వైట్‌గా మార్చుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు నిజంగా రూ. 1000 కోట్లు శ్రీచైతన్య యాజమాన్యం ఎక్కడి నుండి తీసుకువస్తుందో లెక్కలు చెప్పాల్సి ఉంది.
2022, 2023లో ఎంత మందికి ఇచ్చారో లిస్ట్ ప్రకటించగలరా ?
రూ.1000 కోట్ల స్కాలర్‌షిప్ ఇవ్వటం అనేది ఉత్తమాట. ఒకవేళ వేరే సంస్థలో చదువుతూ శ్రీచైతన్య స్కోర్ ఎగ్జామ్‌లో మంచి ఫలితం వచ్చినా ప్రయోజనం దక్కదు. ఎందుకంటే శ్రీచైతన్య సంస్థలో అడ్మిషన్ తీసుకున్న వారికే మాత్రమే ఆ ప్రయోజనం వర్తిస్తుంది. కావలంటే నిశితంగా గమనించండి రూ. 1000 కోట్ల వద్ద స్టార్ మార్క్‌తో షరతులు వర్తిస్తాయి అని ఉంటుంది. ఆ షరతులు అన్నీ శ్రీచైతన్య సంస్థకు అనుకూలంగా ఉంటాయి. చివరికి మోసపోతున్నది విద్యార్థులే. ప్రతిభావంతులని గుర్తించటం, వారిని తమ సంస్థల్లో చేర్చుకోటం శ్రీచైతన్యలో నిరంతర ప్రక్రియ. ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ దగ్గర నుండి సరాసరిన 150/- వసూలు చేస్తున్నారు. గత సంవత్సరం 7 లక్షలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్‌వ్రాయగా, ఈ సంవత్సరం 8 లక్షల మంది చేత ఎగ్జామ్ వ్రాయించాలనే లక్ష్యంగా పెట్టుకుంది శ్రీచైతన్య. ఈ లెక్కన సుమారు 10.5 కోట్ల రూపాయలు ఎగ్జామ్ ఫీజుల నుండి శ్రీచైతన్యకు లభిస్తోంది. ఎగ్జామ్ వ్రాసే వరకే శ్రీచైతన్య హడావిడి, ఆ తర్వాత బహుమతులు ఎంత మందికి ఎన్ని బహుమతులు ఇచ్చింది ఎక్కడ ప్రస్తావించిన పాపన పోలేదు. Infinity Learn వెబ్‌సైట్ వెతికినా ఎక్కడ సమాచారం లభించదు. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చదివే కొందరు ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు వంటి చిన్న చిన్న బహుమతులు ఇచ్చి చేతులు దులుపుకోవటం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏ విద్యాసంస్థ అయినా ఎవరైనా విద్యార్థి కోటి రూపాయల బహుమతి గెలుచుకున్నట్లు ఒక్క విద్యాసంస్థ అయినా ప్రకటించిందా ? లేదు. గత 3 సంవత్సరాలుగా శ్రీచైతన్య నిర్వహించిన స్కోర్ స్కాలర్‌షిప్ ఎగ్జామ్స్‌లో 1000 కోట్లు ఎంత మంది విద్యార్థులకు అందించిందో పూర్తి వివరాలతో కూడిన సమాచారం ప్రజలకు అందించే సాహసం శ్రీచైతన్య చేయగలదా ?
పరీక్షల పేరుతో తీవ్ర ఒత్తిడి !
ఇప్పటికే కార్పొరేట్ స్కూల్స్/ కాలేజీల్లో డైలీ, వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ పేరుతో విద్యార్థులపై ఒత్తిడిని అధికం చేస్తున్న విద్యాసంస్థలు...ఇదీ చాలదు అన్నట్లు స్కాలర్‌షిప్ పేరుతో మరింత ఒత్తిడికి గురిచేస్తున్నాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ 21, 2024 న శ్రీచైతన్య స్కోర్ ఎడ్జ్ స్కాలర్‌షిప్ పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షల కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను సన్నద్ధం చేస్తున్నారు. తమ పిల్లలను మానసిక ఒత్తిడికి గురిచేయటంతో పాటు విలువైన కష్టార్జితాన్ని కార్పొరేట్ సంస్థలకు సమర్పించుకుంటున్నారు. ఇక సిలబస్ విషయానికి వస్తే అక్టోబర్ 6 వ తేదీ కల్లా సిలబస్‌ను కంప్లీట్ చేసేస్తున్నారు. ఏ విధంగా పిల్లల్ని ఒత్తిడికి గురి చేస్తున్నారో అర్థం అవుతోంది. ఆడుతూ పాడుతూ గడవాల్సిన బాల్యం ఇరుకుగదుల్లో కునారిల్లుతోంది. డబ్బులిచ్చి బాల్యాన్ని చెరలో పెడుతున్నాం అని తల్లిదండ్రులు ఆలోచించటం లేదు. ఆయా తరగతులు కేవలం మ్యాధ్స్ & సైన్స్ సబ్జెక్టులపైనే దృష్టి పెట్టించి మిగతా సబ్జెక్టులను గాలికి వదిలేస్తున్నారు. ఇంటర్ వారికైతే మ్యాథ్స్ , ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ సబ్జెక్టులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగతా సబ్జెక్టులకు ప్రాధాన్యతే లేదు. ఎప్పుడూ ఒకే సబ్జెక్టు మీద ఒకే పనిగా రుబ్బితే ఎలా ఉంటుందో ఆలోచించండి. పిల్లలపై ఒకేసారి అనవసరంగా ఒత్తిడి పెంచకండి.
0 Comments