Ticker

6/recent/ticker-posts

Suicides in Sri chaityana Hostels: కార్పొరేట్‌ హాస్టల్స్‌లో ఘోషిస్తున్న ఆత్మలు !

  • కార్పొరేట్‌ హాస్టల్లో పిల్లల ఆక్రందనలు తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదా ?
  • చావులు పెరుగుతున్నా ఎందుకు నిర్లక్ష్యం !
  • విద్యార్థులకు బ్రతికే హక్కు లేదా ?
  • విద్యార్థుల బాధలు సమాజానికి ఎందుకు పట్టడం లేదు.
  • కార్పొరేట్‌ సంస్థలు ఆగడాలకు అడ్డుకట్ట లేదా ?
  • పిల్లల్ని కాపాడుకోవటం సామాజిక బాధ్యత కాదా ?
  • అధికారుల్లో చలనం లేదు, పోలీసులు పట్టించుకోరు, కోర్టులు సుమోటోగా తీసుకోవు,
  • మానవ హక్కులు ఎన్‌కౌంటర్లకేనా ? కార్పొరేట్‌ ఒత్తిళ్ళకు బలైయ్యేవి ప్రాణాలు కాదా ?
  • కార్పొరేట్‌ హత్యలుగా ఎందుకు పరిగణించకూడదు ?
  • డబ్బులు కడుతున్నాం సర్థుకుపోమ్మని తల్లిదండ్రులు అంటున్నారు.
  • మార్కులు, ర్యాంకులు కావాలి అంటూ టీచర్లు ఒత్తిడి పెంచుతున్నారు.
  • సౌకర్యాలు ఉండవు,  అనారోగ్యం వస్తే అనాధ లాంటి బ్రతుకు.
  • సున్నం కలిపిన అన్నం, నీళ్ళలాంటి కూరలు తినలేకున్నాం.
  • హాస్టల్స్‌లో తల్లిదండ్రులు ప్రేమ ఎలా దొరుకుతుంది ?

కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఒత్తిడి చావులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విద్యాబుద్దులు నేర్చుకునేందుకు వెళ్ళి విగత జీవులుగా మారుతున్నారు. ముఖ్యంగా హాస్టల్స్‌లో చదువుల ఒత్తిడి, మార్కుల టెన్షన్‌తో వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ ఎవరూ విద్యార్థుల ఆత్మహత్యలను సీరియస్‌గా పరిగణించటం లేదు. గత కొన్నేళ్ళుగా కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చావు పరంపర కొనసాగుతున్న ఒక్కరంటే ఒక్కరిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలు శూన్యం. ఇంత జరుగుతున్నా ఇలాంటి మరణాల్ని ఆపేవారు లేరు, విద్యార్థుల మరణాలకు బాధ్యత తీసుకునే వారు లేరు. ఇలానే కొనసాగితే భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా తయారైయ్యే అవకాశం ఉంది. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు హాస్టల్స్‌ లాభసాటి వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఆయా సంస్థలు అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తున్నా తల్లిదండ్రులు సహిస్తున్నారు.

తల్లిదండ్రులు...ఇంకెప్పుడు మారతారు !

అప్పుచేసి హాస్టల్‌లో చదివిస్తున్నా, బాగా చవవాలి రా కన్నా అని తల్లిదండ్రులు పిల్లలపై ఎమోషనల్‌ భారం పెడుతున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకే హాస్టల్స్‌లో సౌకర్యాల కొరత, అపరిశుభ్ర వాతావరణం, నాణ్యత లేని ఆహారం ఇలా సమస్యలు చుట్టుముడుతున్నా తల్లిదండ్రుల మాటలు గుర్తుకొచ్చి సర్థుకుపోతున్నారు విద్యార్థులు. కానీ యాజమాన్యం మాత్రం మార్కులు, ర్యాంకుల పేరుతో రోజురోజుకి ఒత్తిడి పెంచుతుంటారు. సిలబస్‌ పెరిగే కొద్ది కొన్ని కాన్సెప్టులు అర్థం కాక విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఇతరులతో పోల్చటం, మానసికంగా హింసించటం, పరుషపదజాలంతో తిట్టడం, ఇంపోజిషన్‌ పేరుతో అర్థరాత్రి వరకు వ్రాయించటం, కొట్టడం వంటి చర్యలతో విద్యార్థులు ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు తీరిగ్గా మీ అబ్బాయి చనిపోయాడు తీసుకుపోండి అనే ఒక్క ఫోన్‌ కాల్‌తో ఒక కుటుంబం ఆశలు కుప్పకూలుస్తున్నాయి. కంటి రెప్పలా కాపాడుతున్న కొడుకు/ కూతురు కానరాని లోకాలకు పోతే ఆ తల్లిదండ్రుల భాధ వర్ణణాతీతం. కానీ ఆ బాధను అర్థం చేసుకునే పరిస్థితి నేటి సమాజానికి లేదా ? ఇది సామాజిక సమస్య కాదా ? తల్లిదండ్రులు తీరు మారాల్సిన అవసరం లేదా ? కార్పొరేట్‌ సంస్థలపై సమాజిక పోరాటం చేయాల్సిన అవసరం లేదా ? 

రెండు నెలల్లో...శ్రీచైతన్యలో 3 మరణాలు !

గుంటూరులోని రెడ్డిపాలెం శ్రీ చైతన్య టెక్నో క్యాంపస్‌లో ఎనిమిదవ తరగతి చదువుతున్న చిలకలూరిపేటకు చెందిన కరణం పద్మసుధ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. అయితే స్కూలులోనే అక్టోబర్‌ 22, 2024 మంగళవారం అర్ధ రాత్రి ఉరి వేసుకుని చనిపోయినట్లు యాజమాన్యం చెబుతోంది. పద్మసుధ మృతికి స్పష్టమైన కారణాలను తెలియజేయకుండా యాజమాన్యం తప్పించుకుంటోంది. కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా యాజమాన్యం ముఖం చాటేసింది.అయితే కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తె మరణం వెనుక వాస్తవాన్ని వెల్లడిరచాలని డిమాండ్‌ చేసినా పట్టించుకున్న వారే లేరు. తాజాగా నిజాంపేట్‌ శ్రీ చైతన్య కాలేజీ లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న బీపీసీ విద్యార్థి బలవన్మారణానికి పాల్పడ్డాడు. జశ్వంత్‌ గౌడ్‌( 17) అనే విద్యార్థి నవంబర్‌ 14, 2024 అర్థరాత్రి గదిలో ఫ్యాన్‌ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం విద్యార్థులు కాలేజీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మృతుడు కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. అయితే శ్రీచైతన్యలో ప్రతి సంవత్సరం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అదేవిధంగా విజయవాడకు చెందిన కౌశిక్‌ రాఘవ (17) మియాపూర్‌ లోని కల్వరి టెంపుల్‌ వద్ద ఉన్న శ్రీచైతన్య కళాశాలలో ఎం.పి.సి. మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నవంబర్‌ 22, 2024 శుక్రవారం అర్ధరాత్రి తన హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే విద్యార్థిని ఆత్మహత్య విషయాన్ని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌ కు తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు శ్రీ చైతన్య కళాశాలకు చేరుకుని నిరసన తెలిపారు. విద్యార్థి మృతి పై విద్యార్థి తల్లితండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, మానసిక వేధింపుల వల్లే కౌశిక్‌ రాఘవ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 




Post a Comment

0 Comments

Popular Posts

Sri Chaitanya : వర్సిటీ మూసివేత ! శ్రీచైతన్య ఉద్యోగుల్లో కలవరం ?
JEE MAIN 2025 ఫలితాల్లో మరో సరికొత్త మోసానికి తెరతీసిన శ్రీచైతన్య !
 SRI CHAITANYA : షెల్‌ కంపెనీలతో  శ్రీచైతన్య డైరెక్టర్ల అంతులేని అక్రమాలు !
IT RIDES : రూ. 230 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడిన శ్రీచైతన్య !
Sri chaitanya Block Money : శ్రీచైతన్య...నల్లధనం కేరాఫ్‌గా వర్సిటీ !
INFINITY META APP : ఆన్‌లైన్‌ పేరుతో ఇన్ఫినిటీ దోపిడీ !
Suicides in Sri chaityana Hostels: కార్పొరేట్‌ హాస్టల్స్‌లో ఘోషిస్తున్న ఆత్మలు !
IT Rides on Sri Chaitanya : కొత్త తరహా మోసంలో శ్రీచైతన్య నేషనల్‌ రికార్డ్‌ !
Sri Chaitanya Hostel : శ్రీచైతన్యపై చర్యలు ఉండవా ? రంగంలోకి AP ‘ముఖ్య’నేత !?
INFINITY LEARN : ర్యాంక్‌గురు (ఇన్ఫినిటీ లెర్న్‌ ) మరో బైజూస్‌ కానుందా ?