- ప్రైవేటు వ్యక్తుల ఇష్టారాజ్యంగా ఒలింపియాడ్ & స్కాలర్‌షిప్ టెస్ట్‌లు !
- సరైన గుర్తింపు లేని నిర్వాహకులు !
- పట్టించుకోని అధికారులు !
- మోసపోతున్న తల్లిదండ్రులు !
ఒలింపియాడ్ ఎగ్జామ్ నిర్వహణ సంస్థలు ఇప్పుడు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. సరైన గైడ్‌లైన్స్ లేకపోవటంతో ఇష్టారాజ్యంగా ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు వ్యక్తులు రకరకాల ఆకర్షణీయమైన పేర్లతో విద్యార్థులను, తల్లిదండ్రుల కష్టాన్ని అడ్డంగా దోచేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ అధికారుల నియంత్రణ కొరవడటంతో ప్రైవేటు వ్యక్తులు ఒలింపియాడ్స్ & స్కాలర్‌షిప్‌ల పేరుతో దోపిడీకి తెగబడుతున్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ మరియు సంస్థలు తమ స్టూడెంట్స్ కోసం తమ సొంత ఒలింపియాడ్స్ నిర్వహిస్తుండగా, చిన్న చిన్న స్కూల్స్ ప్రిన్సిపాల్స్‌ని, ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్‌లను, పీఆర్‌ఓలను ప్రలోభ పెట్టి ప్రతి స్టూడెంట్‌కి రూ. 150/- చొప్పున కమీషన్ ఆశచూపుతూ నెట్‌వర్క్ మార్కెటింగ్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ కోవకి చెందినదే INDIAN SCHOOL OF TALENT SEARCH EXAM (ISTSE) ఎగ్జామ్. బెంగళూరు వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ISTSE ఎలాంటి గుర్తింపు లేదు. ప్రభుత్వ అనుమతులు లేవు. 2019 నుండి వివిధ స్కూల్స్‌ను టార్గెట్ చేసి స్కాలర్‌షిప్ ఒలింపియాడ్ పేరుతో దందా నిర్వహిస్తోంది.
గుర్తింపు లేని సంస్థలు నిర్వహించే ఎగ్జామ్స్‌తో ఏమి ఉపయోగం లేదు !
టాటా ట్రస్ట్ వంటి ప్రఖ్యాత సంస్థలు సదుద్దేశ్యంతో ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహించే స్కాలర్‌షిప్ టెస్ట్ నేడు అభాసు పాలవుతున్నాయి. ఎవరు పడితే వారు తమ స్వార్థానికి స్కాలర్‌షిప్ టెస్ట్‌లు, ఒలింపియాడ్ ఎగ్జామ్స్‌ను వాడుకుంటున్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు లాభసాటి వ్యాపారంగా మలుచుకుంటున్నారు. అసలు ఒలింపియాడ్స్‌కి, స్కాలర్‌షిప్ టెస్ట్‌లకు తేడా తెలియని వ్యక్తులు ఈ ఎగ్జామ్స్ నిర్వహించటం శోచనీయం. ద్వితీయ శ్రేణి నగరాల్లోని 500 ఆపైన విద్యార్థులు ఉన్న స్కూల్స్‌ని టార్గెట్ చేసుకుని ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తుండటం గమనార్హం. చాపక్రింద నీరులాగా విస్తరిస్తున్న ఈ స్కాలర్‌షిప్ ఒలింపియాడ్‌ను అడ్డుకట్ట వేయకపోతే భావితరాల విద్యార్థులపై మానసిక ఒత్తిడితో పాటు తల్లిదండ్రుల కష్టార్జితాన్ని నష్టపోక తప్పదు. ఇప్పటికే పెద్ద స్కూల్స్ మరియు సంస్థలు తమ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తమ సొంత ఒలింపియాడ్స్ నిర్వహిస్తూ దోచుకుంటుండగా, మరి కొందరు ప్రైవేటు వ్యక్తులు ఇతర పట్టణాలు, గ్రామాల్లోని చిన్న చిన్న స్కూల్స్ టార్గెట్ చేసుకున్నారు. ఈ ఒలింపియాడ్స్ ఎగ్జామ్స్ నిర్వహణ లాభసాటి వ్యాపారంగా ఉండటంతో ప్రతి ఒక్కరు ఒక సంస్థను స్థాపించటం, పరీక్షలు నిర్వహించటం, చిన్నచిన్న మెమెంటోలు, సర్టిఫికేట్‌లతో సరిపెట్టడం చేస్తున్నాయి. అసలు ఇలాంటి ఇండియన్ స్కూల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. పిల్లలకు ఒరిగేది లేదు. పైగా అనవసరపు ఖర్చు. పిల్లలపై మానసిక ఒత్తిడి తప్పించి ఐఎస్‌టీఎస్‌ఈ వంటి ఎలాంటి గుర్తింపు లేని సంస్థలు నిర్వహించే ఎగ్జామ్స్ వ్రాయటం వల్ల ఏం ఉపయోగం లేదు.
ఇచ్చేది గోరంత...దోపిడీ కొండంత !
500 ఆపైన విద్యార్థుల సంఖ్య ఉన్న ప్రైవేటు స్కూల్‌ని టార్గెట్ చేసుకుని స్కాలర్‌షిప్ ఒలింపియాడ్ పేరుతో దందా నిర్వహిస్తోంది ఐఎస్‌టీఎస్‌ఈ. 500 ఆపైన విద్యార్థులచే ఎగ్జామ్ వ్రాయించినందుకు ప్రిన్సిపాల్‌కు భారీ మొత్తంలో ముట్టచెప్తుంది ఐఎస్‌టీఎస్‌ఈ. ఉదాహరణకు ప్రతి స్టూడెంట్ నుండి రూ. 450/- వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూల్స్ ఐఎస్‌టీఎస్‌ఈ సంస్థ యాజమాన్యానికి ఎగ్జామ్ ఫీజు క్రింద రూ. 200/- ( 150/- ISTSE కి, రూ. 50/- స్కూల్ ప్రిన్సిపాల్‌కి కమీషన్) చెల్లిస్తున్నాయి. ISTSE ఎగ్జామ్ బుక్స్‌కి రూ. 250/- ( రూ. 220 ISTSE కి, రూ. 30/- స్కూల్ ప్రిన్సిపాల్‌కి కమీషన్) ఇలా ప్రతి విద్యార్థి మీద సరాసరిన 80/- కమీషన్ మిగులు తుండటంతో ఎలాంటి గుర్తింపులేని ISTSE SCHOLARSHIP OLYMPIAD నిర్వహణకు స్కూల్ యాజమాన్యాలు , ప్రిన్సిపాల్స్ సై అంటున్నారు. అదనపు ఆదాయం కోసం ఆశపడుతున్న ప్రిన్సిపాల్స్ తల్లిదండ్రుల కష్టాన్ని దోచేస్తున్నారు. ఒక్కో స్కూల్ నుండి 500 ఆపైన విద్యార్థులు వ్రాస్తే 500 మందికి రూ. 370/- చొప్పున 185000/- ఆదాయం సమకూరుతుంది. దానిలో ఫస్ట్ ర్యాంకుకు 1500 చొప్పున 12 నెలలకు 18000 /- అందించగా 2 బహుమతికి రూ. 12000/- , మూడో బహుమతికి రూ. 6000/-మొత్తం 36000/- చెల్లించి మిగతావి ISTSE జేబులో వేసుకుంటుంది. ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలను ఈ సంస్థ టార్గెట్ చేసింది. దాదాపు 20000 మంది దగ్గర నుండి రూ. 370/- వసూలు చేస్తూ దాదాపు 74,00,000 /- దండుకుంటుండగా, కేవలం అన్నీ స్కూల్స్‌కి కలిపి 10 లక్షల్లోపు స్కాలర్‌షిప్‌లు అందించటం గమనార్హం. ఇంతటితో ఆగటం లేదు. మోడల్ పేపర్ల పేరుతో పాత ఎగ్జామ్ పేపర్ల కోసం రూ. 200/- వసూలు చేస్తున్నారు. ఇంతే కాకుండా ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్యాక్‌తో మ్యాథ్స్ కి రూ. 1049/-, సైన్స్‌కి రూ. 1049/-, ఇంగ్లీష్‌కి రూ. 699/-, కంప్యూటర్‌కి రూ. 699/-, జీకేకి రూ. 699/- ఇలా మొత్తం ఫ్యాకేజీతో రూ. 4195/- అందిస్తున్నారు. కాకపోతే వీటిని తీసుకోవటం తప్పనిసరి కాదు. కొద్దిలో కొద్దిగా ఊరటనిచ్చే విషయం ఏమిటంటే ప్రతి స్కూల్‌లో 500 ఆపైన పరీక్షలు వ్రాస్తే ఆ స్కూల్‌లో ముగ్గురికి (3) ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వనుండటం కొసమెరుపు.
ఎలాంటి అనుమతులు అవసరం లేదు, మేము నిర్వహిస్తాం - యాజమాన్యం !
INDIAN SCHOOL TALENT SEARCH EXAM స్కాలర్‌షిప్ ఎగ్జామ్‌కు ఎలాంటి గుర్తింపు లేదు. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేదు అని సంస్థ ప్రతినిధి వికాస అనిల్‌ను సంప్రదించగా అన్నీ చట్టపరిధిలోనే చేస్తున్నాం. కర్ణాటక ప్రభుత్వ గుర్తింపు పొందాం అని పేర్కొన్నారు. ఆయా అనుమతులకు సంబంధించిన పత్రాలు చూపించమని అడిగితే మీకు చూపించాల్సిన అవసరం లేదని తెలిపారు. అసలు ఐఎస్‌టీఎస్‌ఓ అధినేత ఎవరు ? ఆయన విద్యారంగానికి చేసిన సేవ ఏంటి ? అసలు వికాష్ అనిల్‌కు ఉన్న విశ్వసనీయత ఏంటి ? ఒలింపియాడ్స్ నిర్వహించేందుకు ఆయనకు సహాయసహకారాలు అందిస్తున్న మేధావి వర్గం ఎవరు ? ఎగ్జామ్ పేపర్లు తయారు చేసే మేధావులైన అధ్యాపకుల వివరాలు ఏంటి ? అసలు ఎలాంటి గుర్తింపు లేని ఐఎస్‌టీఎస్‌ఈ పరీక్ష వ్రాయటం వల్ల విద్యార్థులకు ఒరిగే లాభం ఏంటి ? ISTSE యాజమాన్యానికి సంబంధించిన ఎటువంటి సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరచలేదు. అంతా గోప్యంగా ఉంచారు. అంత ట్రాన్సపరెంట్‌గా ఉంటే ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేసి వారి మన్ననలు పొందవచ్చు కదా. ఇలాంటి వివరాలు రిపోర్టర్‌గా అడిగే సరిగా మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు అంటూ ఎదురు దాడికి దిగటం కొసమేరుపు. నిజాన్ని ప్రజలకు తెలియజేయటానికి రిపోర్టర్లు ప్రశ్నిస్తే... నిజాయితీనీ, సఛ్చీలతను నిరూపించుకోవలసిన యాజమాన్యాలు సంస్థకు సంబంధించిన వివరాలను చూపించకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ ఎదురుదాడికి దిగటం ఫ్యాషన్ అయిపోయింది.
0 Comments