మభ్యపెట్టడం, మోసగించటం శ్రీచైతన్యకు వెన్నతో పెట్టిన విద్య. అదే కోవలో ఫలితాలు విడుదలైన ప్రతిసారి మోసపూరిత ఫలితాలు ప్రకటించటం శ్రీచైతన్యకు అలవాటుగా మారింది. జేఈఈ మెయిన్ 2025 ర్యాంకుల ప్రకటనలోనూ ఇదే విషయం మరోసారి తేటతెల్లం అయ్యింది. విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని విజయవంతంగా మభ్యపెట్టింది. ఓపెన్ కేటగిరీలో 100 లోపు 31 ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులు సాధించినట్లు పేర్కొంది. కానీ వారిలో 12 మంది డిఎల్‌పి (డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్)/ ఏఐటిఎస్ (ఆలిండియా టెస్ట్ సిరీస్) కి చెందిన విద్యార్థులవే అని శ్రీచైతన్య తన రెండు పేజీల ప్రకటనలో తెలిపింది. కానీ అది ఎవరికీ అర్థం కాకుండా చిన్న స్టార్ మార్క్ పెట్టి మోసగించింది. స్టార్ మార్క్‌కు అర్థం ఏమిటంటే ఆ ర్యాంకులు అన్నీ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ లేదా ఆలిండియా టెస్ట్ సిరీస్ ద్వారా చదివిన విద్యార్థులవి అని శ్రీచైతన్యయే తన ప్రకటనతో ప్రకటించింది.
డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ముసుగులో ర్యాంకుల కొనుగోలు
నేటి పోటీ ప్రపంచంలో ఎక్కువ ర్యాంకులు కనిపించకపోతే ఎక్కడ అడ్మిషన్లపై ప్రభావం చూపుతుందో అనే భయంతో శ్రీచైతన్య ఎక్కువ ర్యాంకులు చూపేందుకు అడ్డదారులు వెతుకుతుంది. ఇతర రాష్ట్రాల్లో అంతగా పేరు లేని సంస్థల్లో ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులతో శ్రీచైతన్య డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ క్రింద రిజిస్టర్ చేసుకున్నట్లు చూపిస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతోంది శ్రీచైతన్య. ఇలా ర్యాంకులు కొనుగోలు చేసేందుకు తెరవెనుక పెద్ద స్థాయి వ్యక్తులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇలా ఇతర సంస్థలు మరియు ఆయా ర్యాంకర్ల దగ్గర డిఎల్‌పి / ఏఐటిఎస్ పేరుతో గతంలోనే తమ సంస్థల్లోనే రిజిస్టర్ చేసుకున్నట్లు చూపుతుండటం విశేషం. శ్రీచైతన్య ప్రకటించిన ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన దేవదత్త మాజీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన పాత్ ఫైండర్ అనే సంస్థకు చెందిన అమ్మాయి, ఇక 9 వ ర్యాంకర్ తోష్నివాల్ శివన్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన విద్యార్థి కాగా ఫిజిక్స్‌వాలా మరియు బాత్రా క్లాసెస్ సంస్థలు తమ విద్యార్థిగా ప్రకటించుకున్నాయి. ఇక 10వ ర్యాంకర్ సాక్ష్యం జిందాల్ అలెన్ తన విద్యార్థిగా ప్రకటించుకుంది. ఇలా అన్ని సంస్థలు కలిసి తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని మోసగించటంలో తలమునకలై ఉన్నాయి. ఒక ర్యాంకును ఎంత మంది ప్రకటిస్తారు ? అనే వారు లేక పోవటంతో అంతా కార్పొరేట్ సంస్థల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యారంగాన్ని ఫక్తు వ్యాపారంగా మార్చుకుని కోట్లాది రూపాయలు దండుకుంటున్నాయి.
తల్లిదండ్రులారా కళ్ళు తెరవండి !
తల్లిదండ్రులు, విద్యార్థులు ఇంకెన్ని రోజులు కళ్ళు మూసుకుని కార్పొరేట్ సంస్థలు చెప్పే మాటలు, వారు చూపే ప్రకటనలు చూసి మోసపోతారు. మీరు ఇలా గుడ్డిగా శ్రీచైతన్య లాంటి సంస్థలను నమ్మితే మీ డబ్బులతో పాటు మీ పిల్లల విలువైన భవిష్యత్తును కోల్పోవటం జరుగుతూనే ఉంటుంది. డిఎల్‌పి / ఏఐటిఎస్ ర్యాంకులు అసలైన ర్యాంకులు కావు , క్లాస్‌రూమ్‌లో చదివిన విద్యార్థులవే అసలైన ర్యాంకులు అని గమనించగలరు. ఆన్‌లైన్ కోచింగ్‌ను శ్రీచైతన్య లాంటి సంస్థలు డిఎల్‌పి / ఏఐటిఎస్ ర్యాంకుల దందా చేసుకోవడానికే వాడుకుంటున్నాయి. మరో సంస్థ ర్యాంకులను తమ సంస్థ సాధించిన ర్యాంకులుగా ప్రకటించుకోవటం అనైతికం. ఎంత అనైతికం అంటే ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకోవటం లాంటిదే. ఈ తరహా మోసానికి శ్రీచైతన్య పుట్టినిల్లులా వర్థిల్థుతోంది. ఇలా అరువు ర్యాంకుల్ని తమ ర్యాంకులుగా చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్న సంస్థలకు బుద్ది చెప్పాల్సిన తరుణం అసన్నమైంది.
0 Comments